Loading...
.

అమ్మ మనసు

అమ్మ మనసు
నువ్వు మొదటిసారి గర్భాన కదిలినపుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటె బోలెడంత ఆశ కలిగింది అందరికంటె బలవంతువవ్వాలని!
తప్పటడగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకేలేనంతఆనందం పొంగింది నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత దైర్యం వచ్చింది నేను లేకపోయినా బ్రతగ్గలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు త్రుప్తిగా వుంది నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నా క్కొంచెం బాధగా వుంది అందరూ నేపోయానని ఏడుస్తుంటే
నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని....!

"అమ్మ"కవితా సంకలనం నుండి సేకరించటం జరిగింది
'అమ్మ' మనసు గొప్పదనాన్ని ప్రేమను మనకు తెలియచేసిన శ్రీలత గారికి మా నమస్కారములు

మన కోసం మన అందరి కొసం....

భారతీయ సంస్కృతిలో కథ ఒక భాగం..
అమ్మ చేతి గోరుముధ్దలు ఎంత రుచో అమ్మ నోటి కథలు అంతే రుచి
వెన్నెల రాత్రుల్లో చుక్కల పందిరి క్రింద,నులక మంచంపై అమ్మమ్మ పక్కన కూర్చొని....పేదరాసి పెద్దమ్మ కధలు,చిట్టెలుక చమక్కులు,నక్క జిత్తులు,కుందేలు ఎత్తులు,కోమటి లోభితనం,కొరివి దెయ్యాల కబుర్లు,రాజుల జైత్రయాత్రలు,వీరుల త్యాగాలు,వింటూ ఊ... కొట్టని తెలుగు వాడు ఉండరేమో.
చల్లని చంద్రునిలా,సన్నని గాలిలా,జోలపాట పాటపాడుతూ నీతిని,నిజాయితీని,ఆదర్శాన్ని,అనుకువను,అలవోకగా అమ్మ చెప్పిన కధలు-కబుర్లూ మన మస్తిష్కంలో నిక్షిప్తమై మన వ్యక్తిత్వానికి ఒక రక్షణ కవచంలా మనల్నితీర్చిదిద్దుతున్నాయి.
అమ్మ చెప్పినా,అమ్మమ్మ చెప్పినా,తాతయ్య చెప్పినా, వారి ప్రేమ లాగానే ఆ కధలూ-కబుర్లూ మనల్ని సన్మార్గంలో నడుపుచున్నాయి. మన అమ్మమ్మలానే మన కధలు కూడ మనల్ని విడిచి వెళ్లకూడదని,మన సాంప్రదాయం,మన తెలుగు తనం అలనాటి తీపి గుర్తులు నిర్వీర్యం కాకూడదని,సదుద్దేశంతో మా అమ్మ కథలు-కబుర్లు ద్వార మరిచిపోయిన వారికి గుర్తు చేస్తూ, మన తరువాత తరాలకు అ కధలు అందించాలని ఆకాంక్షతో మీ ముందు ఉంచుతున్నాము..
మీ..
శ్రీ

మన సంస్కృతి సాంప్రదాయలను కాపాడుకుందాము



మన సంస్కృతి సాంప్రదాయలను కాపాడుకుందాము(కాపాడుకోవాలి)అను సదుద్దేశముతో ఈ బ్లాగును మొదలుపెట్టాము. ఈ మార్గంలొ నాకు తెలిసిన కొన్ని కధలు,తేట తెనుగు మాటలు,పాటలు,పద్యాలు,శ్లోకాలు,ఇందులో చేర్చబడ్డాయి. మరియు చదివి తెలుసుకున్న సేకరించిన ఎన్నో విషయాలను ఇందులో ఉంచటం జరిగింది. ఈ సందర్భంలో ఎవరి మనసునైనను నొప్పించిన వారికి నా హృదయ పూర్వక క్షమాపణలు. పెద్ద మనసు చేసుకొని వారు మా మార్గాన్ని సుగుమం చేస్తారు అని ఆశిస్తూ...
శ్రీ

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
ఈ కంప్యూటర్ ప్రపంచములో, మన తెలుగును మరిచిపొబోతున్న ఈ రోజుల్లో మన కోసం మన తెలుగును బ్రతికించుకోవటం కోసం "తెలుగులోనే టైప్ చేద్దాం" 'అన్న'మా గురువు గారు 'మహీ గ్రాఫిక్స్' వారికి మరియూ ఇందులో ముఖ్యులైన "కంప్యూటర్ ఎరా" వారికి , మన తెలుగు భ్లాగర్లకి అందరికీ "నా" హృదయ పూర్వక నమస్కారములు
ప్రేమతొ .
శ్రీ...

అతి త్వరలో .......


అతి త్వ రలో మీ ముందుకు వస్తున్నందుకు మరలా మిమల్ని కలవ గలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా వుంది

సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్

అతను 1940లో కేరళలోని తనను తానే పోషించుకోలేని ఓ జూట్ కార్మికుడి ఇంట్లో పుట్టాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. హాస్పిటల్ భిల్లు 600 రుపాయలు చెల్లించకపోతే తండ్రి శవాన్ని తీసుకెళ్ళకూడదని డాక్టర్లు చెప్పడంతో తండ్రి శవాన్ని అలాగే వదిలేయాల్సి వచ్చిన నిర్బాగ్యుడతడు.
అలాంటి చీకటి చిన్నతనంలో అతను ఆ పనులు ఈ పనులు చేస్తూ కాలం గడిపాడు మద్రాసు ఆకాశవాణిలో పాటలు,సంగీత పోటీలలో పాల్గొన్నాడు.పాడాలన్న పిచ్చి ఉన్న ఆ బాలుడి వాయిస్ బాగుండలేదని న్యాయనిర్ణేతలు బహుమతి ఇవ్వలేదు.ఆడిషన్ టెస్టలోనూ ఫెయిలయ్యాడు.
"అతను కుంగిపోయాడు - కాని తాత్కాలికంగానే!బాధపడ్డాడు కాని కొంచెం సేపే!...
ఆలోచించాడు...శ్రమించాడు...తపస్సు చేశాడు పాటలు పాడుతూనే ఉన్నాడు" ..అందుకే "జేసుదాసు" అయ్యాడు.
మరి మరొక మహానుభావుడు విషయం చూద్దాం
"వెలివాడలా ఉంటుంది నిజామాబాద్ జిల్లాలోని మా నాళేశ్వర గ్రామం.అక్కడ వున్న జంగాల కుటుంబం మాదొక్కటే. శవం ముందు శంఖం ఊదడం, ఉదయం పూట భిక్షాటన చేసి బతకటం నాకు చిన్నప్పుడు తప్పలేదు.నా బాల్యం నిలువెత్తు విషాదపటం. యాచక కులవృత్తి వంశంలో జన్మించింది నా దేహం.
చిన్నప్పుడు అమ్మ ఉండగానే నాన్న మరోపెళ్ళి చేసుకోవడం,అమ్మను నాన్న చిత్రహింసలు పెట్టడం,పుట్టిన 30వరోజునే మా చెల్లెలు కన్నుమూయటం,చెరువు కట్ట పక్కనే ఉన్న మా చెల్లిలి సమాధి ధగ్గర నేను ఏడవడం ఇదంతా కన్నీళ్ల ప్రపంచం మా నాన్న నన్ను ఉదయంపూట భిక్షాటనకు పంపేవాడు."మా ఊళ్లో ఎవరు చనిపోయినా శవం ముందు శంఖం ఊదడానికి మా నాన్న నన్నే పంపేవాడు" శవం చుట్టూ చేరి,హొరెత్తి ఏడ్చేవాళ్లను చూసి నాకూ దుఃఖం వచ్చేది.అనేక రాత్రుళ్లు నిద్రలేనివే....
ఇంతటి విషాద బాల్యపు భారాన్ని మోసి..అలా అలా ఆ వ్యక్తి అనంతరం ఎంఏ చేసి ఓ లెక్చరర్ గా ,ప్రముఖ కవిగా ఎదిగారు. అతని పేరు "నాళేశ్వరం శంకరం". అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో సహా వివిధ అవార్డులు పొందిన మహనీయుడు.
ఇలా ఎందరో మహానుబావులు వారి యొక్క అమూల్యమైన విషయాలను మనకు తెలియచేసిన వ్యక్తి "శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర "గారు." సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్" అనే పుస్తకంలొ వారు వివరించారు సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని,ఒడిదుడుకులను ఎదుర్కోగల పట్టుదలను మనకు తెలియకుండా మనలో నింపే అమూల్యమైన పుస్తకం ఈ "సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్"

శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు మీకివే మా హృధయ పూర్వక ధన్యవాదాలు

సొర చెట్టు .. చింత చెట్టు , చివరికి మన సోమయ్య

మన సోమరిపోతు సోమయ్య చింత చెట్టు కింద పడుకొని ప్రక్కింటి మీదికి పాకిన సొరపాదు వంక చూస్తున్నాడు, సొర విరగ్గాసి ఉంది. "తస్సాదియ్య.! నిటారుగా నిలబడను కూడా చేతగాని మొక్కకు కడివెడంత కాయలా..? ఉక్కుముక్కలా పెరిగే చింత చెట్లకు చిటికెడంత కాయలా..?ఇదేం న్యాయమయ్యా దేముడా..? నీకున్నంత శక్తి నాకే ఉంటేనా చింతలకు కొండంత కాయలు, సొరలకు చీమ తలకాయలూ కాయించే వాణ్ణి... నువు చేసేపన్లు కొన్నిసార్లు బొత్తిగా అన్యాయంగా ఉంటాయయ్యా..!" అనుకున్నాడు.
ఇంతలోనే ఓ చింతకాయ రాలి సోమయ్య ముక్కు మీద పడింది.సోమయ్య ఉలిక్కిపడ్డాడు, చింతకాయను చేతుల్లోకి తీసుకున్నాడు.క్షణం క్రితం తను అనుకున్న మాటలు గుర్తొచ్చాయి.గుండె గుభేలు మంది, "అమ్మో ఇంతకు ముందు నేననుకున్నట్టు ఈ చింతకాయ సొరకాయంత ఉండుంటే ఇప్పుడు నా పనేమయ్యేది.." బుద్ది లేనోణ్ణి, దేవుణ్ణి అనరాని మాటలన్నాను అని పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు చేసే ప్రతి పనికి మన ఊహలకందని పరమార్దం ఉంటుంది.దైవసంకల్పాన్ని అంచనా వెయ్యడం మానవుల వల్ల అయ్యేపని కాదు అనుకుంట్టూ దేవుడకి దణ్ణం పెట్టుకొని పని వెతుకుంట్టూ బయలుదేరాడు... దేవుడు నవ్వుకున్నాడు

"ఏ పని ఎందుకు చేస్తాడో దేవుడికి తెలుసు దేవుణ్ణి ప్రశ్నించడం మనిషి పని కాదు,
దేవుడిచ్చింది పుచ్చుకుని ధన్యవాదాలు తెలుపుదాం ఆయన మాటప్రకారం, ఆయన బాట వెంట నడుద్దాం..."

పిట్ట లేని ఊరు రెక్కవిప్పదు.....

నెమలి కోన ఒక పల్లెటూరు. ఒకప్పుడది చెట్టుచేమలతో Free Image Hosting by FreeImageHosting.netపశుపక్ష్యాదులతో కళకళలాడుతూండేది . కానీ .. ఈ వేళ ఆ ఊళ్లో ఒక్క పిట్ట కూడా కనిపించదు. కోడి కూయదు, కిలకిలరావాలతో పొద్దు పొడవదు. అసలేం జరిగింది..?
ఆ ఊరిప్రక్క ఒక అడవి ఉంది అందులో రకరకాల పూలు పళ్లూ గల వృక్షాలు ఉండేవి. ఆ పళ్లూ,దుంపలూ తింటూ ప్రజలు సుఖంగా కాలం గడిపేవారు. ఒకసారి పట్నం నుంచి కొందరు వక్షివ్యాపారులు అక్కడికొచ్చారు.ఆ పరిసరాల్లో ఉన్న పక్షులు చాలా అరుదుగా దొరికే అందమైన పక్షులని పసిగట్టారు. ఆ పక్షుల్ని పట్టి తెచ్చిన వాళ్ళకి ఎక్కువ మొత్తం సొమ్ము ముట్టజెప్పారు.ఇలాంటి పక్షుల్ని ఎన్నితెచ్చినా కొంటామని చెప్పారు.
దీనితో అమాయకులైన ప్రజలు పక్షుల వెంటపడ్డారు. వలలుపన్నారు, గూళ్లు పడద్రోశారు, గుడ్లు తెచ్చి పొదగేశారు ఇలా పక్షివేట ఓ సంవత్సరంపాటు సాగింది.
ఓరోజు తెల్లవారింది ప్రకృతి మూగవోయింది. నెమలికోన చుట్టూ పదిక్రోసుల మేరకు పక్షిజాడ కనబడలేదు.పక్షులు లేక పోవడంతో పురుగుల బెడద పెరిగింది.చెట్ల ఆకులు,పూలు పళ్లూ పుచ్చి రాలిపోయాయి.అడవి ఎడారిగా మారిపోయింది.పిల్లాపాపా ఆకలితో నకనకలాడింది.ఊరు వొట్టిపోయింది.
ప్రజలు భయపడ్డారు, పశ్చాత్తాప పడ్డారు,పక్షులు మళ్లీ తిరిగి రావాలని ప్రార్ధనలు చేశారు, కానీ లాభం లేదు, ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ ఓ చోట చేరి ఏం చేద్దామా అని మంతనాలు జరుపుతున్నారు.
ఇంతలో ఓ చిన్నకుర్రాడు చిన్నారి పంజరం పట్టుకుని జనం మధ్యకొచ్చాడు.అందరూ అతడి వంకా ఆ పంజరం వంకా చూశారు.పంజరంలో ఒక పక్షి జంట.తాము డబ్బుకు ఆశపడి వేటాడి అమ్మిన మేలురకం పక్షుల జంట, ".....మా నాన్న చూడకుండా వీటిని తీసుకున్నాను. నాకు నేనే పెంచుతున్నాను...." అన్నాడు కుర్రాడు.
ప్రజల ముఖాల్లో ఆశారేఖలు ......"వీటిని పెంచండి . పక్షులు తిరిగొస్తాయ్..." అని ఓ ముసాలయన చెప్పాడు
తప్పెట్లు మోగాయి.ప్రజలు ఆనందంతో చిందులాడారు ఆ చిన్న పంజరాన్ని ఊరిమధ్య చెట్టుకు వ్రేలాడుదీశారు.ఆ పక్షి జంటను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.రోజుకోసారి ఊరంతా పంజరం చుట్టూ చేరి ప్రార్ధనలు చేసేవారు,పరవశించి పాటు పాడేవారు,ఆటలాడేవారు . పెంటిపక్షి ఒకేఒక గుడ్డు పెట్టింది, దాని మీదే పొదగడం మొదలుపట్టింది.
ఆ రోజు సాయంత్రం ఊరంతా పంజరం చుట్టూచేరింది. పొదుగుతోన్న పక్షివంకే కన్నార్పకుండా చూస్తోంది. టక.... టక...... శబ్దం.... గుల్ల పగిలింది... పక్షి పిల్ల రెక్క విప్పింది.....కువ కువ లాడింది... ఊరు మనసు విప్పారింది. ఆ ఆనందం నుంచి తేరుకునే లోపే ఆకాశంలో తెరలు తెరలుగా కదలిక.....
తలెత్తి చూశారు ఆశ్చర్యం.............పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి చెట్టుమీద వాలాయి, పంజరం చుట్టూ చేరాయి పంజరం తలుపు తెరుచుకుంది పక్షులన్నీ కలిసి ఆనందంగా ఎగిరిపోయాయి, ఊరు ఉత్సాహంతో ఉరకలేసంది,పరుగులు తీసారు , మైమరిచి నాట్యం చేసారు ....మళ్లీ అడవి చిగురించింది.పక్షుల కిలకిల రావాలతో,ఫలవృక్షాలతో కళకళలాడింది. ఆనాటినుంచి ఈనాటి దాకా ఆ ఊళ్లో కాకికి కూడా అపకారం జరగదు, పిచ్చుకకు కూడా అక్కడి ప్రజలు బ్రహ్మరధం పడతారు..
"పిట్టలేని ఊరు రెక్కవిప్పదు...
ప్రకృతిపై తెగబడితే బతుకుపండదు............."

కూడలి